Wednesday 1 March 2017

మనం మనలా మనాలి :: డా. జి వి. పూర్ణచందు

మనం మనలా మనాలి :: డా. జి వి. పూర్ణచందు
"గాహాణయ గేయాణయ
తంతీ సద్దాణ పోఢ మహిళాణ
తాణం సొచ్చియ దండో
జే తాణ రసం సయాణంతి"
మాట పాట ఆట అన్నీ ఒకదాని వెనక ఒకటిగానే వచ్చాయి. నాదం వీటన్నింటికన్నా ముందు పుట్టింది. ఆమాటకొస్తే మనిషి కన్నాముందే పుట్టింది. కోయిల పాట, నెమలి ఆట సంగీత నాట్యాలకు కులగురువులు. వేదాలు ప్రకృతిని అనుసరించాయి. భారతీయ సంగీతానికి మూలం వేదాలలోని స్వరాలే! సామవేదం భారతీయ సంగీతానికి మూలం. ఇందులో ఏడు నుండి పది స్వరాలు వాటి సంగతులు, గమకాలూ ఉన్నాయి. మరికొంత కాలానికి సంగీతంలో వాది-సంవాది, ఆరోహణ-అవరోహణ, మంద్ర-తారా స్థాయిలు మొదలైన ప్రక్రియలు వచ్చాయి.
సంగీత కళకు లక్ష్య లక్షణాలు నిర్మించి వ్యాప్తికి తేవటంలో ఆంధ్రుల పాత్ర గొప్పది. క్రీస్తు పూర్వం చివరి శతాబ్దాలు - క్రీస్తుశకం తొలి శతాబ్దాల నాటి తొలి ఆంధ్రుల చరిత్రని సూచించే అమరావతి, భట్టిప్రోలు నాగార్జునకొండ, గోలి మొదలైన బౌద్ధ స్తూపాలలో ఇంకా ఇతర శిల్ప సంపదలో ఎన్నో రకాల వీణలు, వేణువు, మృదంగం లాంటి వాద్యాలు మనకు కనిపిస్తాయి. శాతవాహన ప్రభువు హాల చక్రవర్తి సంకలనం చేసిన 'గాథాసప్తశతి' లో ఆనాటి ఆంధ్రుల సంగీత ప్రావీణ్యతని తెలియచెప్పే ఆధారాలు దొరుకుతాయి. పైన చెప్పిన పద్యం గాథా సప్తశతిలో ప్రాకృతభాషలో ఉన్న ఒక గాథ. దానికి రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు "గాథలందు గేయ గతులందు వీణెల/పలుకులందుఁ బ్రోడ మెలఁతలందుఁ/గలుగు మేలి రసము గనుఁ గొనలేనివా/రవని నున్న వారి కదియె శిక్ష" అని అనువాదం చేశారు.
గాథలు( ఆనాటి ఒక కవితా ప్రక్రియ). గేయాలు, తీగవాయిద్యాలు. అందమైన స్త్రీలు వీళ్ళంతా అందించే మేలి రసాల్ని చవిగొనలేని వాళ్ళు ఈ భూమ్మీద ఉంటే, అలా ఉండటమే వాళ్లకు శిక్ష...అంటుందీ గాథ.
ఒక మాటలోని రసాన్ని, ఒక పాటలోని రసాన్ని ఒక పండులోని రసాన్ని, ఒక వంటకంలోని రసాన్ని, ఆస్వాదించటం చేతకాక పోతే ఆ వ్యక్తి కోల్ఫొయేది ఎక్కువ. అది ఎన్ని లీటర్ల ఆల్కాహాలు తాగినా పొందగలిగేది కాదు. సాధారణంగా ఆల్కాహాలికులు త్రాగని వాళ్ళని పట్టుకుని కించపరుస్తూ “మందు కొట్టవు, సిగరెట్లు తాగవు, మాంసం తినవు, వ్యభిచారం చెయ్యవు...ఇంకెందుకు వెధవ బతుకు బతకటం...” అంటూంటారు.
రెండు వేల యేళ్ళనాటి హాలుడు సేకరించిన ఈ గాథని చెప్పిన ఆంధ్రుడు సంగీతసాహిత్యాలంటే మక్కువ లేని వాళ్ళను అదే మాట అంటున్నాడు...మాట, పాట ఆటల్ని ఆస్వాదించలేని వాళ్ళ జీవితం నిరర్థకం. అలాంటి వాళ్ళకు ఈ భూమ్మీద అలా అంటే రాయిలా జీవించటమే ఒక శిక్ష అని!
భాషా సంస్కృతుల పరిరక్షణ అంటే రెండు వేల యేళ్ళకు పైగా తెలుగు ప్రజల జీవితాలతో ముడుపడి నడిచిన మన చరిత్ర పరిరక్షణ. సంస్కృతి అనేది మన జీవన విధానం. సంగీత సాహిత్యాది కళలు దానిని ప్రదర్శిస్తాయి. పదిలపరుస్తాయి. ప్రబోధిస్తాయి. కవులూ, కళాకారులూ తమ బాధ్యతను నెరవేరుస్తారు. తరువాత తరానికి ఆ సంస్కృతీ దివ్వెను అందిస్తారు. ఒకతరం నుండి ఇంకో తరం ఆ దివ్వెను అందుకుని మరింత వెలుగులు నింపుకుంటూ సాగిపోతుంది.
మధ్యమధ్య సామాజిక రాజకీయ పరిణామాలు ఒక్కోసారి ఈ దివ్వెను కొడిబారేలా, తడి ఆరేలా చేస్తుంటాయి. కవులు కళాకారులే పూనుకుని దివ్వెను మళ్ళీ మళ్ళీ సంరక్షిస్తుంటారు.
మధ్య యుగాలలో మహమ్మదీయ దాడులు, 18వ శతాబ్దిలో విదేశీ వాణిజ్య కంపెనీల దాడులతో పోలిస్తే అమెరికా ప్రభావిత వ్యామోహ పూరిత పాశ్చాత్య తరహా ఆధునిక జీవన విధానం, అంధప్రపంచీకరణం, కుటుంబ వ్యవస్థ విధ్వంసం ఇలాంటి ఇప్పటి అనర్థాలు తాటాకు చప్పుళ్ళే అవుతాయి. మాతృభాష గతంలో అలాంటి ప్రతి సందర్భంలోనూ ప్రమాదాలను ఎదుర్కొంది. అందువలన సమాజ నవీకరణానికి సంబంధించిన పదజాలం మన భాషలో అభివృద్ధి కాకుండా పోయింది. తొలి యుగాలలో సంస్కృతం, మధ్య యుగాలలో ఉర్దూ పర్షియన్ భాషలు, బ్రిటిష్ యుగంలో ఆంగ్లం దేశీయభాషల్ని అణగద్రొక్కేందుకే కంకణం కట్టుకున్నాయి. వివిధ కళలతో పాటు చేనేత సహా గ్రామీణ సాంకేతిక వృత్తి విద్యలన్నీ విధ్వంసం అయ్యాయి. హిందూస్థానీ సంగీతం ఉత్తరాదిలో భారతీయ సంగీతాన్ని కమ్మేయగా, దక్షిణాదిలో విజయనగర ప్రభువులు, నాయకరాజులు ఇంకా ఇతరులు భారతీయ సంగీత రీతుల్ని పరిరక్షించారు. విజయనగర సామ్రాజ్య కృషి వలనే కర్ణాటక సంగీతం అనే పేరు స్థిరపడినట్టు “తంజావూరు, ది సీట్ ఆఫ్ మ్యూజిక్” గ్రంథం పేర్కొంది. భాషా సాహితీ వేత్తలు, వివిధ రంగాలకు చెందిన కళాకారులే సంగీత సాహిత్యాది కళల పరిరక్షకులు. ప్రజలు వాటిపట్ల మక్కువని పోగొట్టుకోకుండా అభిరుచిని కొనసాగించాలి. కళల పట్ల అభిరుచి అనేది మనిషన్న వాడి కనీస ధర్మం. అది దేశీయంగా ఉండాలి.
అమెరికా అనేది ‘భూతాల’ స్వర్గం అని తేలిపోయాక మన యువతరం ఆలోచనల్లో దేశీయత పట్ల చిన్నచూపు తగ్గుతుంది. ఆరోజు ఎంతో దూరంలో లేదు కూడా! సమాజ పాశ్చాత్యీకరణం, అమెరికా భక్తి, ఆంగ్లభాషా వ్యామోహాలను కావాలని పనిగట్టుకుని తెలుగు సమాజం మీద రుద్దిన పాపం మన విద్యావ్యవస్థదే!
అభివృద్ధి అంటే కాళ్ళదగ్గర పాలకుందని తన్నుకోవటం కాదనీ దాన్ని మెరుగుపరచి అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళటం అనే దిశలో ప్రభుత్వ ఆలోచన సాగితే ఈ నష్టాన్ని తేలికగానే పూడ్చుకో గలుగుతాం. చేనేత, కుమ్మరం, కమ్మరం లాంటి గ్రామీణ సాంకేతిక కళల్ని కులముద్రతో కాకుండా సాంకేతిక కళలుగా అభివృద్ధి చేస్తే, కులాలకతీతంగా అందరూ వాటిని నేర్చుకుంటారు. వారిలో కొందరైనా అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పగలుగుతారు. మార్పు అనేది అక్కణీంచి మొదలు కావాలి.
మనం అమెరికా లాగా మారటం కాదు, మనం మనలా అమెరికాని మించే సాధకులం కావాలని జాతి విద్వేషానికి బలైన అమరుడు కూచిభోట్ల శ్రీనివాస్ మరణం మనకు పాఠాలు నేర్పుతోంది. కళలు, సాంకేతిక కళలే మన ఉనికిని చాటుతాయి. మన అస్థిత్వాన్ని నిలుపుతాయి.
(కూచిభొట్ల శ్రీనివాసుకు నివాళిగా...)

No comments:

Post a Comment