Monday 11 May 2015

బుల్లి కవితలలో పడమటి గాలి :: డా. జి వి పూర్ణచందు

తెలుగు వెలుగు మాసపత్రిక డిసెంబరు 2012సంచికలో ప్రచురితమైన నారచన

బుల్లి కవితలలో పడమటి గాలి

డా. జి వి పూర్ణచందు


"ఇంగ్లీషులో ఉన్నదంతా అంతర్జాతీయ కవిత అనే భ్రమలోంచి బయటకు వస్తే, తెలుగు కవితలు ఇప్పుడు వస్తున్న ఇంగ్లీషు కవితలకు ఏ మాత్రం తీసి పోవు. ఏ అంతర్జాతీయ కవులకన్నా మన తెలుగు కవులు తక్కువేమీ కారని నా దృఢమైన నమ్మకం." 

కవి హృదయాన్ని అందమైన భాషలో అవిష్కరింఛటమే కవిత్వం. కాళిదాసాదుల కాలం నుంచీ కాళోజీల దాకా పడిన పాద ముద్రలే తెలుగు కవితకు అమ్మానాన్న!ఒక నాటి తీరిక నేటి సమాజానికి లేదు. జీవితం అంటే ఆనాటి దృక్పథం వేరు. నేటి జీవనం వేరు.


పాశ్చాత్య సమాజంలో పవిత్రతా వాదులు సృజనాత్మక సాహిత్యం, సంగీతం ఇవన్నీ ఇహలోక భావనను పెంచేవనే భావనతో, సృజనాత్మక రచనా రీతిని పాపకార్యం అనేవాళ్ళు. ఋషి కాని వాడు కావ్యం వ్రాయలేడని, కవితా రచన మోక్ష హేతువులలో ఒకటనీ భావించుకొన్న సంస్కృతి లోంచి తెలుగు కవిత పుట్టింది. ప్రాచ్య పాశ్చాత్య కవితా రీతులకు మౌలికమైన తేడా ఇక్కడే ఉంది. కవిత్వానికి పునాదులు ఆ జాతి తాత్విక చింతన ఆలంబనగా ఏర్పడతాయి.


క్రీ. శ. తొలి శతబ్దాల నాటి శాతవాహన ప్రభువు హాలుడు సంకలనం చేసిన గాథా సప్తశతి రోజుల్లోనే తెలుగు నేలమీద స్వేఛ్చాకవిత రాజ్యం ఏలింది. నన్నయ తరువాత పాల్కురికి సోమనాథుడు దేశి కవిత అవసరాన్ని నొక్కి చెప్పాడు. “అల్పాక్షరముల ననల్పార్థ రచన కల్పించుటయు కాదె కవి వివేకంబు...?”అని వెయ్యేళ్ళ క్రితమే ప్రశ్నించినవాడాయన. నిడివి ఎక్కువైతే కవిత్వం పలచ బడు తుంది, దట్టంగా అల్లుకొన్న భావం సాగి, చీరిక లౌతుందని తెలుగు కవిత్వానికి సంబంధించి నంత వరకూ తొలిసారిగా గుర్తించినవాడు పాల్కురికి.

ఒక సామాజిక ఉద్యమం ఏర్పడినప్పుడు వాటి ప్రభావం సాహిత్యాది కళల మీద తప్పకుండా ప్రసరిస్తుంది. సాధారణంగా కవులు త్వరగా ప్రతిస్పందిస్తారు. అమెరికా స్వాతంత్ర్య పోరాటం ప్రభావం అమెరికన్ కవిత్వ తత్వాన్నే మార్చేసింది. ఫ్రెంచి విప్లవం ప్రపంచ సాహిత్య తీరు తెన్నుల్ని కొత్త లోకాలకు మళ్ళించింది. భారత స్వాతంత్ర్య సమరం దేశభక్తిని, భావప్రకటనా స్వేఛ్ఛను కవిత్వంలో ప్రతిబింబించే0దుకు దోహదపడింది.

ఇంక తెలుగులోకి వస్తే, ఆధునిక యుగంలో నిజాన్ని నగ్న0గా ఆవిష్కరించే ధోరణిని దిగంబర కవిత ప్రవేశ పెట్టింది. దాని ప్రభావం విప్లవకవిత ఆవిష్కరణకు ఎంతగానో కారణం అయ్యింది. అభ్యుదయ, విప్లవ కవితా ధోరణులు రెండూ రెండు ధృవాలై  కవితా రీతులను శాసించిన కాలంలో, కవిత్వం తిరుగుబాటు ధోరణులకు మాత్రమే పరిమితం అయ్యింది. దైనందిన జీవిత సమస్యలు, మానవ సంబంధాలు అప్రధానం అయ్యాయి. సుదీర్ఘమైన సిద్ధాంత చర్చలు తప్ప కవితాత్మకత అనేది అపురూపం అయినప్పుడు, సంక్షిప్తత, దేశీయత అనే వెయ్యేళ్ళ నాటి పాల్కురికి సో్మనాథుని ఆలోచనలకు కార్యరూపం ఇవ్వటం ఒక తప్పనిసరి అయ్యింది. ఈ నేపధ్యంలోనే 1978లో తెలుగులో మినీకవితా ఉద్యమం ప్రారంభం అయ్యింది.

కొత్త రూపంలో, కొత్త భావాలతో, కొత్త అంశాలతో మినీకవిత ఆనాటి తెలుగు యువతను ఎంతగానో ఆకట్టుకొంది. ఇప్పుడు లబ్దప్రతిష్టులైన కవులు ఎందరో మినీ కవితా ఉద్యమం నేపధ్యం లోంచి వచ్చిన వారు ఉన్నారు. మినీకవితలంటే శబ్దాలు, మినీ కవితలంటే మెరుపులు, మినీకవితలంటే ప్రభంజనాలు అన్నంతగా ఆనాటి ఉద్యమం నడిచింది.

ఆంగ్ల కవులు కూడా లయాన్విత కవిత్వీకరణకు, సూటిదనానికి చిన్న రూపాలు అనువుగా ఉంటాయని భావించారు. వాళ్ళ భాష, వాళ్ళ సామాజిక జీవన పరిస్థితులు కూడా అందుకు దోహదపడేవిగా ఉంటాయి. ఒక కవితలో చెప్పిన భావాలకన్నా, చెప్పకుండా దాచి, పాఠకుని ఆలోచనలకు పదును పెట్టే ధ్వనిగర్భిత కవిత్వం చిన్న రూపంలో ఒదిగినట్టు పెద్దకవితలో కనిపించదని కూడా అనేకమంది విమర్శకులు భావించారు.

ఆసు రాజే0ద్ర రాసిన“ఆకాశమంత ఉందికదా అని/వాన చినుకు/సముద్రాన్ని ఆశ్రయిస్తే/దాని బతుకూ ఉప్పన అయిపోయింది” అనే మినీ కవిత ఇందుకు చక్కని ఉదాహరణ.  అనువుకాని వారితో స్నేహం అనర్థ దాయకం అని కవి హెచ్చరిస్కతాడీ కవితలో! .

ఇంగ్లీషులో ఉన్నదంతా అంతర్జాతీయ కవిత అనే భ్రమలోంచి బయటకు వస్తే, తెలుగు కవితలు ఇప్పుడు వస్తున్న ఇంగ్లీషు కవితలకు ఏ మాత్రం తీసి పోవు. ఏ అంతర్జాతీయ కవులకన్నా మన తెలుగు కవులు తక్కువేమీ కారని నా దృఢమైన నమ్మకం.

మినీ కవిత ప్రారంభం అయిన కాలంలోనే, హైకూ’ అనే జపానీ లఘురూపం ప్రేరణతో ఇస్మాయిల్ ప్రభృతులు తెలుగులో కొత్త  ప్రక్రియకు ప్రారంభం పలకగా, నానీలు, రెక్కలు, దాదీలు, తాతీలు, చిట్టీలు, పొట్టీలు ఇలా ఎన్నో ప్రయోగాలు తెలుగులో వచ్చాయి. ప్రయోగాలు చేయటం కవికి సహజ లక్షణం. ఎవరూ చెప్పని కొత్త విషయాన్ని కొత్తగా చెప్పాలనే తపనే కవికి రాణింపు నిస్తుంది.


ఆ కొత్త దనం బుర్రకు తట్టాలంటే, ప్రపంచ పోకడ కూడా రచయిత గమనిస్తూ ఉండాలి. ఒకప్పటికన్నా ఇప్పుడు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అరచేతిలో ప్రపంచాన్ని అందుకోగలిగే అవకాశం ఏర్పడింది. తమ రచనలను నెట్లో ఉంచాలని కవులు బాగా ప్రయత్నిస్తున్నారు. ఫేసుబుక్, ట్విట్టర్, బ్లాగుల్లాంటి అవకాశాలెన్నో సామాన్యుడి స్థాయికి వచ్చేశాయి. ఎంత ఎక్కువ సాహిత్యం చదివితే అంత రాణింపు వచ్చే అవకాశం ఈ రోజున ఉంది. అందుకే, తెలుగు లోకి తెచ్చుకొని మనకు తగ్గ రీతిలో మలచుకొనేందుకు అవకాశం ఉన్న కొన్ని ఆంగ్ల లఘురూపాలను పరిచయం చేయటం ఈ వ్యాసం లక్ష్యం


ఒకప్పుడు ఆంగ్లంలో సానెట్స్ ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. 14-15 పాదాల కవిత ఇది. సానెట్ పేరు చెప్పగానే, ఎమెర్సన్ రాసిన “ఎ ఫేబుల్” చటుక్కున గుర్తుకొస్తుంది.

“కొండకీ ఒక ఉడుతకూతగువయ్యిందికొండ ఉడుతతో అందికదా...” అన్నిమొదలయ్యే ఈ కవితలో ఆఖరున ఉడత అంటుంది:“మహారణ్యాన్ని నేను వీపున మోయలేను,
చిన్న పప్పుగింజని నువ్వు కొరకలేవు” అని!

ఎవరి గొప్ప వారిది, ఎవరి బలహీనత వారిది- ఏనుగు నుండి దోమ దాకా దేన్నీ లోకువగా చూడనవసరం లేదని ఈ సానెట్ చెప్తుంది. దీన్ని పీడిత తాడిత వర్గాల అభ్యున్నతికి అన్వయించి ఎంత వ్యాఖ్యాన్నయినా చేయవచ్చు.

ఇటాలియన్ సానెట్, పెట్రార్చియన్ సానెట్ లాంటి ప్రక్రియల్లో ఆంగ్ల కవితలు ఇప్పుడు బాగా వస్తున్నాయి.  స్పెన్సర్, హోరేస్ పేర్లతో కొన్ని కొత్త కవితా రూపాలు కూడా వెలిశాయి. జపానీ హైకూల ప్రబావం తెలుగుకవుల మీద బాగా ఉంది.  హైకూలే కాదు, కొత్త లఘు కవితా రూపాలు మరికొన్ని జపాన్లో ఇప్పుడు వ్యాప్తిలో ఉన్నాయి.

Senryu కవిత

సమాజమూ,మానవ సంబంధాలను దృష్టిలో పెట్టుకొని  ‘సెండ్ర్యూ’ కవిత రూపొందింది. ఇది 3 పాదాల కవిత. హాస్యం, వ్యంగ్యం ఇందులో ప్రధానంగా ఉంటాయి. దాని నడక ఇలా ఉంటుంది:

 “తల దువ్వుకొంటున్నానుఅద్దంలో కనిపించే ముఖ0అది మా అమ్మది”

ఈ కవితలో యతులూ, ప్రాసలూ,గణాలు, పాదాలు పదాల నియమాలేవీ లేవు. తక్కువ మాటలు ఎక్కువ భావం దీని లక్ష్యంగా కనిపిస్తుంది.  ఇలాంటిదే ఇంకో ‘సెండ్ర్యూ’ కవితను పరిశీలించండి:

“రాత్రి ఆకాశంఆ పిల్లవాడు
చుక్కల ఓడల్ని చిత్రిస్తున్నాడు”

ఇది చంద్రుణ్ణి భావుకతకు సంకేతంగా చూపిస్తున్న కవిత. చంద్రుణ్ణి మనం మనః కారకుడిగా భావిస్తా0. జపాన్ వారికి  అది కొత్త కావచ్చు అందుకే ఈ కవితను చాలా మంది విమర్శకులు గొప్పగా ఉదహరించారు.

Tanka కవిత


జపాన్ వారి మరో లఘు కవితా ప్రక్రియ టాంకా కవిత.  “దుమ్ములో సూరీడు” అనే ఈ టాంకా కవితను చూటండి:

 “సూర్య కిరణాలు ప్రవహిస్తున్నాయిమొగ్గ తొడుక్కుంటున్న కొమ్మల గుండావసంతం అడవిలోకి వచ్చింది
         దుమ్ముకణాలు తేలుతూ         నేలను చేరుతున్నాయి”

సూర్యుడు లేకపోతే పత్రహరితం లేదు, ప్రకృతి లేదు. సూర్యుడు ఒక జవం, జీవం, ఒక చైతన్యం. లోకానికి వసంతాన్ని తెచ్చేది సూరీడే! సూరీడుని  అభ్యుదయ చైతన్యానికి ప్రతీకగా చిత్రిస్తున్న ఈ టాంకా కవితలో మొదటి మూడు పాదాలు విషయాన్ని ప్రతిపాదిస్తే చివరి రెండు పాదాలు దానికొక గమ్యాన్ని చూపిస్తున్నాయి.

Cinquain కవిత:


 సింక్వాయిన్ కవిత ఒక ఆంగ్ల లఘు కవితా రూపం. ఇది 5 పాదాల ప్రక్రియ. మొదటి పాదం కవితా శీర్షిక అవుతుంది. తరువాత రెండు పదాల పాదం, మూడుపదాల పాదం, నాలుగుపదాల పాదం వరుసగా ఉంటాయి.“డైనోసార్లుఒకప్పుడు ఉన్నాయిఎన్నో ఏళ్ళప్పుడు, కానీకేవలం మట్టీ ఇంకొన్ని కలలుమిగిలున్నాయి”

ఇది సింక్వాయిన్ కవితకు ఒక ఉదాహరణ. దీన్ని ట్రయాంగిల్ కవిత అని కూడా అంటారు. ప్రతీ పాదాన్నీ మధ్యకు తెచ్చి పేరిస్తే పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. అందుకని పిరమిడ్ కవిత అని కూడా పిలుస్తారు. ఇందులో ప్రతి పాదానికీ ఒకప్రత్యేకత ఉంటుంది. మొదటి పాదం శీర్షిక, రెండో పాదం విషయ విశ్లేషణ, మూడో పాదం దాని పూర్వాపరాలు, నాలుగో పాదం దాని భావావేశం ఉంటాయి. 5వ పాదంలో ఒకే పదం ఉంటుంది. అది శీర్షిక కొనసాగింపుగా ఉంటుంది. ఒకటీ ఐదవ పాదాలను కలిపి, “డైనోసార్లు మిగిలున్నాయి” అని అర్ధం సాథి0చటం కవి లక్ష్యం. రాతి యుగాలనాటి చా0దస భావజాలంలోంచి బయట పడాలనే సందేశం ఇందులో కనిపిస్తుంది.Blank verse కవితఛ0దోబందోబస్తులను తెంచుకొని పుట్టిన వచనకవితలో ఒక చిన్నరూపాన్ని  Blank verse అంటారు. A poem written in unrhymed iambic pentameter and is often unobtrusive అని దీనికి నిర్వచనం. అంత్య ప్రాశలు యతి ప్రాసల నియమం లేకుండానే లయబద్దంగా మాట్లాడే తీరులో ఈ కవిత ఉంటుంది. లయాన్విత కవితాత్మక వచనాన్ని బ్లాంక్ వెర్స్ అని నిర్వచించవచ్చు.

“ఆ కుర్రాడేం చేస్తున్నాడిప్పుడు, బంతి పారేసుకున్నాడే వాడు?
ఏంటి ఏంటి వాడు చెయ్యాలనుకుంటో0ది? నేను చూశాను... దాన్నిగొప్పగా గె0తుకొంటూ, నడివీధిలో, ఆ తర్వాతగొప్పగా అక్కడ ఆ నీళ్ళలో!”

John Berryman రాసిన The Ball Poem కవితకు ఇది తెలుగు అనువాదం.  ఇందులో పైకి కనిపించే భావం ఏమీ లేదు. పైగా చాలా సాధారణమైన విషయం. బంతాట ఆడుకొంటున్న కుర్రాడు విసిరిన బంతి, వీధిలో ఎగురుకొంటూ వెళ్ళి నీళ్ళలో పడింది. దీని ద్వారా రచయిత చెప్పదలచుకొన్నది ఏమయినా ఉన్నదా? బాల భారతంలో ద్రోణుడు బావిలోంచి బాణాలతో బంతిని తీసి ఇచ్చిన కథ లాంటిదీ ఇందులో కనిపించదు. కానీ, భూగోళంతో ఆడుకోవటం ఒక పిల్ల చేష్ట. చివరికి అది ఎవరికీ దక్కకుండా పోతుంది... అనే హెచ్చరిక ఇందులో దాగి ఉంది. ఇంకొకరికి మరో అర్ధం ఏదయినా ఇలానే స్ఫురించవచ్చు కూడా. ఓ తెల్ల కాయితాన్ని ఇచ్చి ఎవరి ఊహను వారు చిత్రించుకోవాలని కాబోలు ఈ కవితను  Blank verse అన్నారు.

Epigram కవిత:


టెలీగ్రాంలలో వాడే భాష, లేదా ఎస్సెమ్మెస్సులు ఇచ్చేందుకు వాడే భాషని ఉపయోగించి తయారు చేసిన హాస్య స్ఫోరక కవిత ఇది. “ఎపి” అనేది శాసనాలకు సంబంధించిన పదం. అది దీనికి పేరుగా స్థిరపడి, ఎపిగ్రామ్ కవిత అయ్యింది.“ఎపిగ్రామ్పొట్టి ఆకారంసంక్షిప్తత శరీరంవ్యంగ్యం ప్రాకారం”

ఎపిగ్రామ్ కవితకు నిర్వచనాన్ని ఇలా ఎపిగ్రామ్ పద్ధతిలోనే రాయవచ్చు. దీని రూపం చాలా విలక్షణంగా ఉంటుంది. ఒక ఎపిగ్రామ్ కవితను పరిశీలించండి:“చక్కెరదొరికితే లక్కేరాకానీ, మద్యం
దొరకటం తధ్యం”

ఇందులోని లోతైన భావాన్ని మాటలతో వివరించే ప్రయత్నంస్తే, స్వారస్యం చచ్చి పోతుంది. దాన్ని దానిగానే అర్ధం చేసుకోగలగాలి. మన దేశంలోనూ,రాష్ట్రంలోనూ ఉన్న పరిస్థితికి అద్దం పడుతున్నదీ అంతర్జాతీయ కవిత.“ఒప్పుకొంటున్నా తమరి రూలుప్రతీ కవీ ఒక ఫూలునిలువెత్తు నిదర్శనం మీరేఫూల్సంరూ కవులు కారే!”  
 
అనేది ఎపిగ్రామ్ రచనకు ఇంకో ఉదాహరణ. పొడిమాటలతో ఇది కనిపించినా ఇందులో లయ ఉంది, ప్రాస నియమాలున్నాయి. అతి తక్కువ మాటలతో గొప్ప ఆలోచనాత్మకతను కలిగించటం దీని లక్ష్య0. అల్పాక్షరాలతో అనల్పార్ధ రచనకు ఇది మంచి ఉదాహరణ.

Epitaph కవిత


విషాదాన్నీ, మరణాన్నీ చిత్రిస్తూ, సంతాప సూచకంగా చెప్పే కవితను ఎపిటాఫ్ కవిత అంటారు. తక్కువ పాదాలలో కవితాత్మకంగా ఉంటుంది. సమాధుల మీద చెక్కేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.  “పుటక నీది/చావు నీది/బతుకంతా దేశానిది” అంటూ జేపీ మీద కాళోజీ వ్రాసిన ప్రసిద్ధ కవిత ఈ ఎపిటాఫ్ కవితకు చక్కని ఉదాహరణ!

“అబ్బో! ఆయన గొప్ప వైద్యుడుఇంకా గొప్ప స్నేహశీలిఅద్భుతమైన మేథావి
చిట్టచివరి రోజున తప్ప!”

ఇలా ఉంటుంది ఎపిటాఫ్ కవితా రూపం. విదేశీ కవితలో వ్యంగ్యాన్ని పులిహోరలో జీడిపప్పు తాలింపు పెట్టినట్టు జోడిస్తున్నారు. మన కవులు ఈ విషయాన్ని గమనించాలి. వ్యంగ్యం ఎక్కువమంది పాఠకుల్ని తెస్తుంది.

Terza Rima కవిత: 


తెర్జా రీమా కూడా జపానీ లఘుకవితా రూపాలలో ఒకటి.New life begins to spring to life in spring
Green shoots appear in the April showers
Birds migrate back home and rest tired wings      

ఒకటీ మూడూ పాదాలకు అంత్య ప్రాసని గమనించవచ్చు. ప్రతీ పాదంలోనూ 8-10 పదాల వరకూ ఉంటాయి.ABC కవితఒక భావావేశాన్ని, ఒక చిత్రాన్ని, ఒక అనుభూతిని కళ్ళకు కడుతూ, ఐదు లైన్లలో ఉండే కవితా ప్రక్రియ ఏబీసీ కవిత.  ఐదు పాదాలలో చక్కని భావావేశం, చిక్కని శబ్ద చిత్ర0, అంతులేని అనుభూతిని కలిగించటం దీని పరమావధి. ఇందులో ప్రతీ పాదంలోనూ మొదటి పదాలు అకారాది క్రమంలో ఉంటాయి. అందుకని ఏ బీ సీ కవిత అనే పేరు వచ్చింది. 5వ పాదం మకుటంగా ఉంటుంది. మచ్చుకొక ఆంగ్ల కవితను పరిశీలిద్దాం.A lthough things are not perfect
B ecause of trial or pain
C ontinue in thanks giving
D o not begin to blame
E ven when the times are hard
F ierce winds are bound to blow

Acrostic కవిత


మొదటి అక్షరం లేదా మొదటి పదం ఒక భావోద్దీప్తిని కలిగించేదిగా ఉన్నప్పుడు దాన్ని Acrostic కవిత అంటారు. ఈ ఉదాహరణ పరిశీలించండి.C reamy or
H ot, it makes my mouth scream
O n and on
C hocolate, chocolate
O h, yum
L uscious chocolate, I can't believe I
A te it all. It
T ickles my throat              
E ach time I eat it, mmm oh I love chocolate.

మొదటి అక్షరాలన్నీ కలిపి ఆ కవిత శీర్షికగా నడిపిస్తే, మంచి మినీ కవిత అవుతుంది.  ఇలాంటి ప్రయోగాలు లోకోపకారకంగా ఉండాలి. మనవాళ్ళు సన్మాన పత్రాల రచనల్లోనూ, పెళ్ళిళ్ళప్పుడు పంచరత్నాల రచనల్లోనూ ఎక్కువగా చేస్తుంటారు.  వైవాహిక, సాంసారిక జీవితాన్ని గురించి, లోకం పోకడల గురించి, సమాజం గురించి విశ్లేషణాత్మకమైన మినీకవితలను ఇచ్చే పద్ధతిని తెలుగులోకూడా తీసుకు రాగలిగితే అందరూ చదివే అవకాశం ఉంటుంది. కవి అనే వాడు తన భావాన్ని ప్రచారం చేసేందుకు అందివచ్చే ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. అది పెళ్లయినా సరే, చావైనా సరే!

చివరిగా ఒక మాట


దేశీయతను సాధించ గలిగితే, తెలుగు కవిత సంపన్నమే అవుతుంది. తెలుగులో చిన్న కవితలదే రాజ్యం. విదేశాలలోనూ చిన్న రూపాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. అల్పాక్షరాలు, అనల్పార్థాలే ప్రపంచ కవితను పాలిస్తాయి. లోకం పోకడ తెలుసుకోవటం వలన మరింత శక్తివంతంగా తెలుగు కవితను తీర్చిన వాళ్ల0 అవుతాం. అందుకు ఈ వ్యాసం కొంచెం సహకరిస్తుందని ఆశ