Friday 14 August 2015

తెలుగింటి పుల్కాలు      
డా. జి వి పూర్ణచందు  
 కాశీఖ౦డ౦ కావ్య౦లో శ్రీనాథ మహాకవి అ౦గరపూవియఅనే వ౦టకాన్ని ప్రస్తావి౦చాడు. దోసియలు సేవియలు న౦గర పూవియలు, సారసెత్తులు, జొత్తరలు చక్కిల౦బులు ఇలా సాగుతుంది శ్రీనాథుడి కాలం నాటి వంటకాల పట్టిక. ఈ అంగర పూవియ, అంగార పూలు, అంగార పోలికలు, అంగరొల్లెలు ఇలా అయ్యలరాజు నారాయణామాత్యుడు, గణపవరపు వే౦కటకవి లాంటి ఇతర కవులు కూడా కొన్ని వంటకాలను ప్రస్తావించారు. మన ప్రాచీన వంటకాలకు మన సాహిత్యాధారాలే ముఖ్యమైనవి. వాటి గురించి మన వ్యాఖ్యాతలు గానీ, మన నిఘంటు కర్తలు గానీ ఒక భక్ష్య విశేషం అని వ్రాసి ఊరుకోవటం చేత ఆ నాటి పేర్లు, ఆ వంటకాల తీరూ ఏదీ మనకు తెలీకుండా పోయింది. ఒక విధంగా ఇది దురదృష్టకరమే!

బసవ పురాణ౦లో పోలెఅనే వ౦టకం ప్రస్తావన ఉంది. బసవపురాణం వెయ్యేళ్ళ క్రితం తెలుగు ప్రజల సాంఘిక చరిత్రకు ఒక లిఖిత పూర్వక సాక్ష్యంగా గ్రహించ వలసిన గ్రంథం. పాల్కురికి సోమనకు పూర్వ కవులు సాంఘిక జీవనానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ బాధ్యతను నెరవేర్చిన వాడు సోమన.
ఆప్టే స౦స్కృత నిఘ౦టువులో పోలికాపదానికి గోధుమ పి౦డితో చేసిన భక్ష్య విశేష౦ అనే అర్థ౦ ఉ౦ది. గోధుమ పి౦డిని తడిపి, నెయ్యి లేక నూనెతో మర్ది౦చి ముద్దగా చేసిన దాన్ని పోలిఅ౦టారు. పోలితో చేసిన వ౦టక౦ పోలికలేదా పోళిక. పోళీఅనే ప్రయోగ౦ కూడా ఉ౦ది. పలుచగా వత్తి, కాల్చిన రొట్టెని మరాఠీలో పోలె౦అ౦టారు. ద్రావిడ భాషల్లో పొలి, పోలి పదాలు పొ౦గారు, పెద్దదగు అనే అర్థాలలో కన్పిస్తాయి. పూర్వ ద్రావిడ భాషలో pol-i- పదానికి to acquire, gain, prosper అని అర్థం. ద్రవిడియన్ ఎటిమలాకకకల్ డిక్ష్నరీ DEDR 4550లో కూడా ఇదే అర్థ౦ కనిపిస్తుంది. ఒత్తిన పోలిని కాల్చి పొంగించింది పోలికకావచ్చుప్రాకృత౦లో పోలి-”, స౦స్కృత౦లో పోలికతెలుగు తదితర ద్రావిడ భాషల్లో పూప, పోపిక, పౌల్చ, పోల్చ, పోళిక పదాలు కాల్చిన రొట్టె అనే అర్థాన్నే ఇస్తున్నాయి. నిప్పులమీద గానీ. సన్న సెగమీద గానీ కాల్చి తయారు చేసిన రొట్టెల్ని పోళి, పోలిక పుల్కా ఇలా పిలిచి ఉంటారని ఒక ఊహ చేయవచ్చు. పోళీ అ౦టే బొబ్బట్టు అని తెలుగు వ్యుత్పత్తి కోశ౦లో ఉ౦ది. కన్నడ౦లో పోలిగె, మోళిగే అ౦టే, పెన౦ మీద కాల్చిన బియ్యపు పి౦డి రొట్టె అని!

ఇంకో కోణంలోంచి పదాన్ని పరిశీలిద్దాం: తెలుగులో పోలుశబ్దానికి ప్రాచీన యుగాల నుండీ వృత్తిపరంగా వస్తున్న మరో అర్థ౦ కూడా ఉ౦ది. ఇదే ముఖ్యమై౦ది కూడా...! కు౦డలు చేయట౦ కోస౦ జిగురు వచ్చే౦తవరకూ మట్టిని మర్దించి సారె మీద లి౦గాకార౦లో ఉ౦చిన ముద్దని పోలుఅ౦టారు. పోలుని సారె చక్ర౦ మీద ఉ౦చి, లోపల బోలుగా ఉ౦డేలా కావలసిన ఆకార౦ లోకి మలచటాన్ని పోలుపట్టట౦అ౦టారు. కు౦డల తయారీ మన ప్రాచీన విద్య. తెలుగువారి తొలినాటి విద్యలకు స౦బ౦ధి౦చిన సా౦కేతిక పదాలు తెలుగు భాషలోనే రూపొ౦దుతాయి. జాతి ప్రాచీనతకు భాష ప్రాచీనతకు వృత్తిపరమైన పదాలు ఎంతగానో ఉపయోగిస్తాయి. క్రమేణా ఇలా౦టి సా౦కేతిక పదాలు నిత్యవ్యవహార౦ లోకి కూడా చేరి అనేక కొత్త అర్థాలనిస్తాయి. కు౦డల తయారీకి స౦బ౦ధి౦చిన పోలిఅనే పదాన్ని జిగురు వచ్చేదాకా మర్ది౦చిన పి౦డి ముద్దకు తెచ్చి ఆపాదించటమే ఇ౦దుకు తార్కాణ౦.

కార్తీక మాస౦ అమావాస్య వెళ్ళిన పాడ్యమి తెల్లవారుఝామున పసుపు ముద్ద(పోలి)తో చేసిన గౌరమ్మను పూజి౦చి, అరటి దొన్నెలలో దీపాలు వెలిగి౦చి నీళ్ళలో వదులుతారు. పోలిని స్వర్గానికి ప౦పే కార్యక్రమ౦ ఇది. పసుపు ముద్ద(పోలి) పూజలో ప్రధానమై౦ది. పోలి శబ్దం తడిపిన పిండి లేదా మట్తి ముద్దని సూచిస్తోంది. గోధుమ పి౦డితో పోలెను తయారు చేసి, పలుచగా గు౦డ్ర౦గా వత్తి, సన్నసెగను కాలిస్తే అది పోలిక. దాన్నే ఇప్పుడు పుల్కా అ౦టున్నారు. తెలుగు పోలె లేదా పోలికలకు ఆధునిక రూపమే పుల్కా! వెయ్యేళ్ళుగా తెలుగు ప్రజలు కమ్మగా తయారుచేసుకుని తింటూ రుచిని ఆశీర్వదించిన తెలుగింటి వంటకం ఇది. ఇవి తక్షణం శక్తినిస్తాయి. ప్రధాన ఆహారంగా ఉపయోగపడతాయి. వరి అన్నానికి బదులుగా తినవలసినవి.

ఈ మధ్య హోటళ్లవాళ్ళు ఒకటో రెండో పూరీలు లేదా పుల్కాలు వడ్డించి ఆంధ్రాభోజనం అంటున్నారు. ఇది ఆంధ్రా భోజనం ఎలా అవుతుంది...? ఆంధ్రులకు పూరీని అన్నానికి ముందు తినే అలవాటు ఎక్కడిదీ? అలా తినటం వలన జీర్ణశక్తి మందగించి అపకారమే చేస్తుంది.


తక్కువ పాపికే ఓటు :: డా. జి వి పూర్ణచందు

తక్కువ పాపికే ఓటు
డా. జి వి పూర్ణచందు

ఒకటికి రోయకుంట గను మున్నవియున్, దృపదుండు మారణే
ష్టికి( బసిజూపి వేడ- మునిసింహు డొకండు తమన్న వేల్చు( బం
దొక డపవిత్ర భూమి గని యే జనదా గ్రహించె రో
యకొనియె, గాన నట్లెఱుగనౌ జను, సర్వము(గా నశక్యమె?”

వీడు మంచివాడా? చెడ్దవాడా? ఎలాంటి నీచానికైనా దిగజారతాడా? అని ఆ వ్యక్తి గురించి తెలుసు కోవాలంటే ఉన్నవి తెలుసుకోవాలంటాడు కృష్ణదేవరాయలు. ఆయన గొప్ప రాజుగారు. మూడు సముద్రాలూ ఆయన అధికార పరిధిలో ఉండేవి. ఆ స్థాయిలోఉన్నవాళ్లకి ప్రతి ఒక్కడి ప్రొఫైలూ విడివిడిగా పరిశీలించి, ఎవడెలాంటి వాడో నిర్ధారించటం సాధ్యం కాదు. అందుకని, వ్యక్తులు చేసే చిన్నపనుల్నిబట్టి, వాళ్లని అంచనా వేయాలన్నాడు. ఉన్నవి తెలుసుకోవటం అంటే అది!

ఒకటికి రోయకుంట గను మున్నవియున్అంటే, అసహ్యమైన పని చేయటాన్ని అసహ్యించు కోకుండా చేసే తత్వం ఉన్న ఒకడికి ఉన్నవేమిటో (బుద్ధులు)తెలిసిపోతుంది. ఎలాగంటావా…? ఒక ఉదాహరణ చెప్తాను

దృపదుండుమారణేష్టికి(బసిజూపివేడ- మునిసింహుడొకండుఒకప్పుడు దృపద మహారాజు (ద్రౌపదితండ్రి) మారణేష్టి అనే యఙ్ఞం తలపెట్టాడు. తన శత్రువు లందరూ చచ్చి పోవాలనే కోరికతో చేసే యఙ్ఞం అది! ఇప్పటి రోజుల్లో అయితే ధికారంలో ఉన్నవాడు సి బి ఐని ఉపయోగించుకున్నట్టే అప్పటి రాజులు ప్రతిపక్షం మీదకు ఇలాంటి య్ఙ్ఞాలను ప్రయోగించే వారన్నమాట!  శత్రూ మారక యఙ్ఞాన్ని చేయించటానికి బ్రాహ్మలెవరూ ముందుకు రాలేదు. వందల సంఖ్యలో ఆవులు ఇస్తానని ఆశ చూపించాడు. కానీ, ఎవరూ కదల్లేదు. చివరికి ఎక్కడో అడవుల్లో తపస్సు చేసుకుంటున్న ఓ మునిసింహంగురించి విని వెదుక్కొంటూ వెళ్ళాడు.

మునిసింహుడొకండుతమన్నవేల్చు( బందొక డపవిత్ర భూమి గని యే జన దా గ్రహించె రోయకొనియె ఆ మునిసింహం దృపదుడి కోరిక వింటూనే అసహ్యించుకున్నాడు. ఇలాంటి ఆలోచనలున్న వాడివి కాబట్టే, నీకు అంతమంది శత్రువులు ఏర్పడ్డారు. శత్రు భయం నిన్ను పీడిస్తోంది. అందువలనే ఇలా కోరుతున్నావు. మంచి తనంతో శత్రుత్వం తగ్గించు కోవాలి గానీ, శత్రువు లందరూ చచ్చి పోవాలి అని కోరుతో యఙ్ఞం చేయా లనుకోవటం నీచాతినీచం అని మందలిస్తాడు. రాజు బతిమాలుకుంటే అప్పుడు చెప్పాడు: మా అన్న ఒకడున్నాడు…  వెళ్ళి ఆయన్ని కలుసుకో! వాడైతే ఇలాంటివి అవలీలగా చేయిస్తాడుఅంత గ్యారంటీగా ఎలాచెప్తున్నా నంటావా…? ఒకసారి మేవిద్దరం కలిసి వెడుతున్నాం.  అప్పుడు ఒక పండు చెట్టుమీంచి రాలి పడింది. ఆ సమయంలో ఇద్దరికీ బాగా ఆకలిగా ఉంది. చెరి సగం తినాలనుకున్నాం. తీరాచూస్తే, ఆ పండు అశుద్ధం పైన రాలింది. నాకొద్దులే అని చెప్పి నేను వెళ్ళిపోయాను. మావాడు ఆ పండునే తుడుచుకుని తినేశాడు. వాడికి ఉఛ్ఛనీచాలు లేవు. ఎంత నీచానికైనా రోయడు. ఛీ అనుకోడు. నువ్వు అడిగింది చేయటానికి వాడే సమర్థుడు…” అని!
గాన నట్లెఱుగనౌ జను, సర్వము(గాన శక్యమె?”వాడు చేసేపనిని బట్టి బుద్ధి ఎలాంటిదో తెలుసు కోవాలేగానీ, మొత్తం జీవితం అంతా చూసి తెలుసు కోవాలంటే కుదరదుఅంటాడు. ఇది ఆముక్తమాల్యద కావ్యంలో రాజనీతి బోధించే సందర్భంలో చెప్పిన పద్యం. తన రచనలో వీలైనంత మేర స్వీయాను భవాల్ని చెప్పుకోవాలనే తపన రచయితకి సహజంగా ఉంటుంది! అందుకని, యమునాచార్యుడిచేత కుమారుడికి రాజనీతిపాఠాలు చెప్పించే సన్నివేశాన్ని సృష్టించుకున్నాడు కృష్ణదేవరాయలు.

ఆముక్తమాల్యద 600 యేళ్ళ నాటి కావ్యం. అవి సత్తెకాలపు రోజులు. ఇప్పు డలాంటి సీను లేదు. పేడ మీద పడ్డవి ఏరుకు తినేవాణ్ణి తెచ్చి అందలం ఎక్కించటానికి వెనుకాడని కాలం మనది! నీతి కూడు పెడుతుందా? నిజాయితీ ఐశ్వర్యాన్ని ఇస్తుందా? ఆదర్శం అందలం ఎక్కిస్తుందా? అని వాళ్ళు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్ళూ వాళ్లు తిన్నారు, ఇప్పుడు నేను తింటే తప్పొచ్చిందా? అని బహిరంగం గానే అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకు ప్రజల దగ్గర సమాధానం లేదు.

తాగిన మైకంలో అర్ధరాత్రి ఇష్టారాజ్యంగా కారు నడుపుతూ ఒక డ్రైవరు, ఫుట్పాత్ మీద అలిసి పడుకున్న వాళ్లపై నుండి దూసుకు పోయాడు. ఒకడు చనిపోయాడు. కొందరికి గాయాలయ్యాయి. ఆ డ్రైవరు మామూలు మానవుడైతే, పందొమ్మి దేళ్ళు విచారణ లేకుండా జైల్లోనే ఉంచేవాళ్లు. కానీ, అదే నేరాన్ని ఒక సినిమా నటుడు చేశాడు. దాంతో సీను మారింది.

భారత దేశంలో సినీనటులు దైవాంశ సంభూతులు కదా! ఈ నేరాలూ శిక్షల చట్రంలో వాళ్లను తెచ్చి బిగించి, వాళ్ళగురించి ఉన్నవి వెలికి తీసి, అపకారం చేయాలని చూస్తే అంతకన్నా అపచారం ఇంకొకటి ఉండదు. అందుకే, తీర్పు వ్యతిరేకంగా వచ్చినా, ఘడియలూ విఘడియలూ గడవ కుండానే అసాధారణ రీతిలో జైలు తప్పించి బైలు ఇప్పించి, ఈ దేశంలో అంతటి అపచారం జరక్కుండా పై కోర్టులు కాపాడాయి! దేవుడి లాంటి మనిషి జైల్లో పడకుండా దేశం పరువు నిలబెట్టాయి.


రాయలవారు తన రాజనీతి పాఠాల్లో ఉన్నవి తెలుసుకోఅని చెప్పాడు గానీ, తెలుసుకుని ఏం చేయాలో చెప్పలేదు. రాజకీయ, సామాజిక, వాణిజ్య, పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన సెలెబ్రిటీ లనదగిన వారిలో ఇలాంటి ఉన్నవి చాలా ఉంటాయి. తెలిసీ... తెలిసి తెలిసీ... ఎక్కువ పాపికన్నా తక్కువ పాపి మేలనే భావనతో ఓట్లేసి ఊరక చూచుచుండటం తప్ప జనం చేసేదేమీ లేదని ఆయనకు తెలుసు కాబట్టి! 

గోదావరి ఒడ్డున మరోనాగార్జునుడు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి :: డా. జి వి పూర్ణచందు

గోదావరి ఒడ్డున మరోనాగార్జునుడు
శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి
డా. జి వి పూర్ణచందు

శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి పేరుతో ఇద్దరు ప్రముఖులు రాజమహేంద్రి కేంద్రంగా గత శతాబ్ది తొలినాళ్ళలో దీపస్తంభాలై నిలిచారు. తెలుగు జన జీవితంలో వెలుగులు నింపిన ఇద్దరూ ఉద్దండులే! ఒకరు మహాకవి. ఇంకొకరు మహావైద్యులు.

మహాకవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు (1866-1960) ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థానకవి. జన మనోహర భాషలో పత్రికలు రావాలనే లక్ష్యంతో 1901 లో రాజమ౦డ్రి ను౦డి గౌతమి దినపత్రికని తెచ్చిన జాతీయ వాది. రామాయణం, భారతం, భాగవతం మూడింటినీ తెలుగు వచన అనువాదం చేశారు.

రెండవ వారు మహావైద్యునిగా కీర్తి గడించిన రసవైద్య నిపుణులు, ఆయుర్వేద భూషణ, భిషగ్వర శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు. రసశాస్త్రంపై పట్టు సాధించి మరో నాగార్జునుడిగా కీర్తి పొందారు. అనుభవ దీపికఆయుర్వేదౌషధ రత్నాకరం, ఆంధ్ర భైషజ్య రత్నావళి’, ‘భస్మప్రకాశికమొదలైన గ్రంథాలను ఒక వైద్యుడుగా, ఒక ఫార్మాసిష్టుగా తన అనుభవాలు రంగరించి రచించారు. చరక సంహిత ఆరు స్థానాలనూ స్థానషట్కం పేరుతో అనువదించి, తులనాత్మక వ్యాఖ్యానంతో ప్రచురించారు. పరిశోధనాత్మకంగా, సాధికారికంగా వ్యాఖ్యానం సాగుతుంది. చికిత్సా విధానంలో కొత్త పోకడలకు దారులు వేశారు. వైద్యశ్రీ శ్రీపాద కృష్ణమూర్తిగారి కృషి వైద్య ప్రపంచంలో చిరస్మరణీయమైంది.

 “ఔషధం గుణాలూ, వైద్యుడి మనోశక్తి రెండూ తోడైనప్పుడే చికిత్స విజయవంతం అవుతుంది అంటారాయన. మనసా వాచా పరిశుద్ధుడై  మందుని ఇస్తున్నాను. ఇది పని చేసి తీరాలిఅనే గట్టి సంకల్పంతో ఔషధ ప్రయోగం చేస్తే అది మరింత పనిచేస్తుందనీ, రోగిని మోసగించో, అబద్ధాలు చెప్పో డబ్బు గుంజాలనే ఆలోచన లేకుండా రోగి బాధ తగ్గటమే లక్ష్యంగా ఔషధం ఇవ్వాలనీ ఆయన నమ్మకం. అలాంటివైద్యుల్ని అమృత హస్తులుగా కొలుస్తారు. శాస్త్రి గారి హస్తవాసి రాజమహేంద్రి, పరిసర ప్రజలకు బాగా తెలుసు. పురప్రముఖులు శ్రీ వై. యస్.నరసింహారావు గారు కోటిపల్లి బస్టాండ్ దగ్గర మెయిన్ రోడ్డు మీదే శాస్త్రి గారి ఆసుపత్రి ఉండేదన్నారు. వైద్యసేవ తప్ప మరో ధ్యాస లేని నిస్వార్ధుడిగా ఆయన గురించి చాలా మంది పెద్దలు చెప్పారు

 కృష్ణపండితీయం అనే నామాంతరం కలిగిన తన ఆయుర్వేదౌషధ రత్నాకరం గ్రంథంలో ఆయన చెప్పుకున్న ప్రవరను బట్టికౌశికస గోత్రికులైన శ్రీపాద సోమయాజిగారు ఆయన తండ్రి! సుబ్బమ్మగారు తల్లి! కోనసీమలో మోడేకుర్రు గ్రామం ఆయన పుట్టిన ఊరు. బహుశా అది మాతామహుల గ్రామం కావచ్చు! ఏడుగురు మగపిల్లలూ, ముగ్గురు అక్కచెల్లెళ్ళ మధ్య రెండవ సంతానం మన శాస్త్రిగారు.
సహజంగా స్థితిమంతులు కావటాన,  ఒకరిపైన ఆధారిత జీవనం లేనందున, వైద్యపరంగానూఔషధపరంగా కూడా తాను తేదలచిన మార్పుల్ని నిస్సంకోచంగా తీసుకు వచ్చారాయన. నేటికీ అవి ప్రామాణికమే! వైద్యంలో తనదైన ముద్ర, తన వంతు పాత్రతను సూచించే మెరుగులు, తాను ప్రదర్శించిన మెరుపులు… ఇవి కృష్ణమూర్తి శాస్త్రి గారిని చిరంజీవిని చేశాయి. గోదావరీ తీరం పండిత పరివేష్టితం కాబట్టి, తన కృషికి కావల్సిన సహృదయత ఆయనకు దొరికింది. అదొక కలిసొచ్చిన అంశం.

1925-27 మధ్య కాలంలో శాస్త్రిగారు బెజవాడ రామమోహన కళాశాలలో ప్రతివాద భయంకర కృష్ణమాచార్యుల వారు తి. . రామానుజ స్వామి గార్లతో కలిసి ఉపాధ్యాయులుగా పనిచేశారు. దగ్గరగా విద్యార్ధిని కూచోబెట్టుకుని లాలించి బోధించే పద్ధతిలో ఆయన రచనలు ఉండటానికి ఆయనలో ఉన్న ఉపాధ్యాయుడే కారణం.

భయమూ ఉదాసీనతల వలన ఆయుర్వేద వైద్యులు శాస్త్రంలో చెప్పిన ఎన్నో ముఖ్య ఔషధాలను ప్రయోగించటానికి జంకుతున్నారు. భయాన్ని పోగొట్టటానికి శాస్త్రంలో చెప్పిన అనేక యోగాల తయారీని, పాటించవలసిన మెళకువల్నీ తెలియ చెప్పటం ఒక అవసరంగా భావించారాయన. వాటి తయారీ విధానాన్ని మెరుగు పరచి, మార్పులు చేసి, తేలిక పరిచి, తయారు చేసి చూసి, తన అనుభవాన్ని డైరీల్లో నమోదు చేశారు. రస, గంథకాదుల శుద్ధితో మొదలు పెట్టి, పుటం పెట్టింది లగాయితూ ఔషధం తయారయ్యే వరకూ వండుతున్నప్పుడు ఆ ఔషధంలో వచ్చే పరిణామ క్రమాలు , రంగు రుచి వాసనలతో సహా వివరాలన్నీ ఘడియ కొకసారి నమోదు చేశారు. దానినే  అనుభవదీపిక గ్రంథంగా సలహాలూ సూచనలతో  ప్రచురించారు.
 “ఇంతయేల? పుస్తకమును వ్రాయు నప్పుడు మేము అనేక చిత్ర విచిత్రములగు మార్పులను చేయుటచే, షుమారు 20 సంవత్సరముల నుండియు సంపాదించిన ఙ్ఞానము కంటె అనేక విధములగు ఙ్ఞానమును సంపాదించితిమి. ఇంతకంటె మేమేమి వ్రాయవలయునో మాకే తెలియ కున్నదిఅని అనుభవదీపిక గ్రంథ గురించి చెప్పుకున్నారాయన. వ్రాయవలసిందంతా వ్రాశానన్న ఆత్మవిశ్వాసం ఆ మాటల్లో తొణికిస లాడుతుంది. తెలుగులో ఇలాంటి పుస్తకం లేదని సగర్వంగా చెప్పగల రచనలు అనేకం చేశారాయన.  
వైద్య రహస్యాల్ని ఇలా అచ్చువేయటం వలన గుట్టు పోతుందని, గౌరవం ఉందదనీ కొందరు అభ్యంతర పెట్టినప్పుడు కృష్ణమూర్తి శాస్త్రిగారు రహస్యములు బయలు పడుట చేతనే శాస్త్రమైననూ అభివృద్ధి నొందగల దనియు, గౌరవమును పొంద గలదనియు నా యభిప్రాయము అని సమాధానం చెప్పారు.

సూతికాభరణము, త్రైలోక్య చింతామణి, నవరత్న చింతామణి లాంటి ఔషధాల తయారీ అందరికీ సాధ్యం అయ్యేది కాదు. వాటి తయారీకి, వాటిని వైద్యులు ప్రయోగించటానిక్కూడా ప్రావీణ్యం కావాలి.  ఔషధాల  తయారీ, అందులో కలిసే ద్రవ్యాల గురించిన అవగాహన ఉంటే ఆత్మవిశ్వాసంతో చికిత్స చేయగలుగుతారు. రజతలోహ రసాయనం, కస్తూరి మాత్రలు ఇలాంటివి తెప్పించి రోగులకు వాడుతున్న వైద్యులు వాటిలో ఏవేవి కలిశాయో, వాటి తయారీ ఎలా జరిగిందో, ఆలోచించ కుండానే వాడేస్తున్నారని, తయారీదారులూ వివరాలను చెప్పటం లేదనీ, ఇలా చేయటం న్యాయమా అని ప్రశ్నిస్తారాయన. ఇంచుమించు వందేళ్ళ క్రితం సమస్యని ఆయన లేవనెత్తి ప్రశ్నించారో సమస్య అంతో ఇంతో పెరిగిందే గానీ, తగ్గలేదు.
ఒకవైపు రోగుల్ని చూసుకుంటూ, ఇంకో వైపు, ముడిఖనిజాలు, లోహాలు, మూలికలను శుద్ధులు చేసుకుంటూ వైద్యుడి పాత్రనీ, తయారీదారు పాత్రనీ ఒకేసారి పోషించారాయన. అందరికీ అది సాధ్యపడకపోవచ్చు! ప్రామాణికత కలిగిన ఫార్మసీలు నమ్మకమైన ఔషధాలు ఇచ్చినప్పుడు వైద్యులకు చికిత్సపైన ప్రయోగాలకు ఎక్కువ అవకాశం ఉంటుందంటారాయన.

శాస్త్రి గారు ప్రముఖంగా చెప్పిన ఔషధాలలో కాంతవల్లభరసం ఒకటి! క్షీణింప చేసే వ్యాధుల్లో రోగిని బతికించేందుకు విష్ణువే  స్వయంగా చెప్పిన ఔషధంగా దీన్ని ఆయన పేర్కొన్నారు. దీని గురించి శాస్త్రిగారు సూచించిన విధంగా రోగులకు ఇచ్చినప్పుడు టిబీ, ఎయిడ్స్, హెపటైటిస్, డెంగ్యూ లాంటి క్షీణింప చేసే వ్యాధుల పైన, అర్థరైటిస్, చికుంగున్యా లాంటి వాత వ్యాధుల పైన ఇది గొప్పగా పనిచేస్తోన్నతీరుని ఈ వ్యాసకర్త కూడా గమనించటం జరిగింది.శాస్త్రిగారు చెప్పిన మెళకువలు ఆయుర్వేద ప్రాక్టీషనర్లకు బాగా ఉపయోగపడతాయి.

కాంతవల్లభరసం  ఔషధాన్ని నాలుగైదు కుప్పెల్లో ఉంచి ఇసుక నింపిన పాత్రలో(వాలుకాయంత్రం) ఉంచి, ఐదారు రోజుల పాటు వండే విధానం వివరిస్తూ, గాజుకుప్పెలో ఔషధం పాకానికి వచ్చిందో లేదో తెలియటానికి ఒక గాజు కడ్డిని ముంచి తీసి చూస్తేమణిశిల పచ్చగా అంటుకుని ఉంటుందనీ, పాదరసం తెల్లగా పట్టుకుంటుందనీ, గంధకం వాసన పూర్తిగా పోయాక పాకం పూర్తవుతుందనీ వివరించారు.  ఇలా ఔషధం సక్రమంగా తయారైందని నిర్ధారించే పరిక్షలెన్నో ఆయన చెప్పారు.
రోగి కోరే ఔషధం కాబట్టి కాంతవల్లభ రసంఅని, వసంత ఋతువులో పూసే పూవుల రసంతో భావన (నానబెట్టటం) చేసి ఔషధం తయారు చేస్తారు కాబట్టి, వసంత కుసుమాకరం అనీ, పదహారు భాగాలు గంధకం కలుస్తుంది కాబట్టి, చంద్రుడి పదహారు కళలకు గుర్తుగా, పూర్ణచంద్రోదయంఅనీ, సిద్ధుల కోసం చెప్పింది కాబట్టి, ‘సిద్ధమకరధ్వజం అని, చంద్రుడిలా చలవచేస్తుంది కాబట్టి  తారకేశ్వర రసంఅని, ఇలా ప్రతి ఔషధానికి పేరు ఎలా వచ్చిందో ఆయన చక్కగా విపులీకరించారు.

శీతాంశు రసాన్ని ఆనందభైరవినీ అల్లం రసంతో ఇస్తే దీర్ఘకాలంగా తగ్గని శీతపైత్య జ్వరాలు తగ్గుతాయి, తేలుకాటుకు విరుగుడుగా ఉపయోగపడుతుంది. సిందూరభూషణం వేడి వలన వచ్చే దగ్గు మీదా, సువర్ణ భూపతి కఫ దోషం వలన వచ్చే దగ్గుమీద, లోకనాథ రసం అజీర్తి వలన కలిగే దగ్గు మీద, మహాలక్ష్మీవిలాసరసం ద్వంద్వ దోషాలవలనవచ్చే దగ్గు మీద ఇలా ఒకే వ్యాధి పైన వివిధ ఔషధాలను ఎలా ప్రయోగించాలో తెలియచెప్పే handbook లాగా ఆయన రచనలు వైద్యులకు ఉపయోగ పడతాయి. మాత్రలు చేసేప్పుడు బిగింపు (binding) కోసం తేనెద్రాక్షలాంటివాటికి బదులుగా తుమ్మబంకని కలపటాన్ని ఆయన తీవ్రంగా నిరశించారు. కొండవీటి చాంతాడంత ప్రిస్క్రిప్షన్లు ఇచ్చే నేటి కాలపు పద్ధతుల్ని ఆయన ఖండించారు. అనేక ఔషధాల్ని ఒకేసారి ప్రయోగించటం వలన వికృతి కలుగుతుంది. అలాంటప్పుడు మందుల్ని బాగా తగ్గించి, ఒకటికో రెండుకో పరిమితం చేయాలి. లేదా కొన్ని రోజులపాటు మందూ వేయకుండా ఆపటమే మంచిదంటారాయన. 

కరోమి సూక్ష్మయా బుద్ధ్యా లోక రంజక ముత్తమమ్ ధర్మార్ధ సుఖసాధనం అయిన ఆయుర్వేద మహాశాస్త్రాన్ని నేర్పిన గురుదేవులు పండిత దీవి గోపాలాచార్యుల వారికి నమస్కరించి, లోకం మేలు కోసం తన గ్రంథ రచన సాగాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆయన ముందుకు నడిచారు. లోకం మేలు కోరటం వైద్యుడి కర్తవ్యం.


ఔషధంలో కలప వలసిన మూలద్రవ్యాలు, వాటి శుద్ధి, వండవలసిన తీరు, పక్వానికి పరిక్షలు, దాన్ని ప్రయోగించ వలసిన వ్యాధులు, మోతాదు, అనుపానం ఇన్ని విషయాలనూ సంస్కృత శ్లోకాలలో వ్రాసి, వ్యాఖ్యానం కూడా జోడించి ప్రచురించిన ఆయుర్వేదౌషధ రత్నాకరం, అనుభవ దీపిక, భస్మప్రకాశిక గ్రంథాలు వైద్యులకు కరదీపికలు కాగా, చరకానికి వారి వ్యాఖ్యానం గొప్ప మార్గ దర్శక గ్రంథంగా నిలిచింది. రస శాస్త్రం పైన, వంటౌషధాల పైన అంతటి పట్టువున్న వైద్యులు అపురూపం..